Friday 9 February 2018

వెలుగొండల్లో రైల్వే సొరంగ మార్గం తొలిదశ పూర్తి

అద్భుతం.. అబ్బురం!
09-02-2018 03:13:50

‘వెలుగు’ చూసిన సొరంగం!
వెలుగొండల్లో రైల్వే సొరంగ మార్గం తొలిదశ పూర్తి
దక్షిణ భారతంలోనే అతిపెద్దది!
రాపూరు, ఫిబ్రవరి 8: తిరుమల ఘాట్‌రోడ్డును తలపించేలా వెలుగొండలో గురువారం మరో అద్భుతం ఆవిష్కృతమైంది. సహజ సిద్ధమైన నిలువెత్తు కొండలు.. దట్టమైన అడవులు.. కనువిందు చేసే జలపాతాలు, వన్యప్రాణులతో నిం డిన తూర్పు కనుమల్లో రైలు మార్గానికి మార్గం సుగమమైంది. కృష్ణపట్నం-ఓబులవారిపల్లి రైల్వే లైన్‌ నిర్మాణంలో భాగంగా ఇక్కడి ఏడుకొండల్లో చేపట్టిన రైల్వే సొరంగ మార్గం తొలిదశ నిర్మాణ పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. దీంతో దక్షిణ భారతంలోనే అతి పెద్ద రైల్వే సొరంగమార్గంగా ఇది రికార్డులకెక్కనుంది.

ఇదీ ప్రత్యేకత...
అటు కడప జిల్లా చిట్వేలి మండలం చెర్లోపల్లి సమీపంలోని అడవుల నుంచి, ఇటు డక్కిలి మండలం మాధవాయపాలెం సమీప అడవుల వరకు ఈ సొరంగాన్ని మలిచారు. అటు నుంచి 960 మీటర్లు, ఇటు నుంచి 6.6 కిలోమీటర్లు వెరసి 7.5 కిలోమీటర్ల సొరంగాన్ని 8 మీటర్ల ఎత్తు, 7.5 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. రూ.500 కోట్ల అంచనా వ్యయంతో 2015 మే, నవంబర్‌ నెలల్లో పనులు ప్రారంభించారు. అటువైపు సొరంగమార్గాన్ని 2016లోనే పూర్తిచేశారు. ఇటువైపు 6.5 కిలోమీటర్ల వరకూ చేపట్టి ఆపేశారు.

ఎట్టకేలకు గురువారం రాత్రి 6 గంటలకు చెన్నై రైల్వే వికాస్‌ నిగామ్‌ లిమిటెడ్‌(ఆర్‌వీఎన్‌ఎల్‌) జనరల్‌ మేనేజరు, సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పనులు కొనసాగించారు. చివరికి ఒక మీటరు మిగిలి ఉండడంతో బ్లాస్టింగ్‌ జరపగా సొరంగం పూర్తయింది. దీంతో తొలి దశ నిర్మాణ పనులు పూర్తయినట్లు ఆర్‌వీఎన్‌ఎల్‌ అధికారులు ప్రకటించారు. లోపల ప్రత్యేకంగా భారీ పైప్‌లు ఏర్పాటుచేసి ఆక్సిజన్‌, గాలి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. సొరంగంలో సిమెంటు కాంక్రీటు ప్లాస్టరింగ్‌, విద్యుత్‌ సదుపాయం, రైల్వే ట్రాక్‌ పనులు చేపట్టాల్సి ఉంది.

15 నిమిషాల్లో పాస్‌బుక్‌.. పొందండిలా..!

15 నిమిషాల్లో పాస్‌బుక్‌.. పొందండిలా..!
09-02-2018 11:54:34

పాస్‌ పుస్తకం కావాలంటే ఎంత సమయం పడుతోంది... ఒక రోజు.. రెండు రోజులు.. వారం రోజులు.. కానే కాదు.. సంవత్సరాలు.. నెలలే.. మామూళ్లిస్తే మామూలుగా అయిపోయేది.. లేదంటే జారీకి గడువే ఉండేది కాదు.. అంతా రెవెన్యూ వారి చేతుల్లోనే ఉండేది. రైతులు మాత్రం కాళ్ళరిగేలా కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉండేవారు. అయితే ఇదంతా గతం.. ప్రస్తుతం పాస్‌ పుస్తకం కావాలంటే అన్నీ సక్రమంగా ఉంటే 15 నిమిషాల్లో రెడీ.. అవునా అంటూ ఆశ్చర్యపోకండి మరి.. అదెలాగో తెలుసుకోవాలనుందా అయితే ఈ కథనం చదివేయండి మరి..

ఏలూరు: ఏ ధ్రువీకరణపత్రం కావాల్సినా.. కరెంట్‌ బిల్లు కట్టాలన్నా.. ఆధార్‌ నెంబర్‌ అనుసంధానం చేయాలన్నా.. ఓటు హక్కు కావాలన్నా.. ప్రతీ ఒక్కరి నోటా వినిపించే ఒకే ఒక మాట మీ సేవ.. అన్ని సేవలు ప్రస్తుతం మీ సేవలో అందుతున్నాయి..దీంతో ప్రభుత్వ కార్యాలయాలతో పనిలేకుండా పోయింది. ఏం అవసరమైనా మీ సేవలో దరఖాస్తు చేస్తున్నారు. గడువు పూర్తయిన తరువాత వచ్చి తీసుకుపోతున్నారు. దీనిలో భాగంగానే ప్రభుత్వం కూడా మీ సేవలను పెంచుతూ పోతోంది. ప్రస్తుతం పాస్‌ బుక్‌ కావాలంటే మండల కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేదు. మీ సేవలో దరఖాస్తు చేస్తే చాలు 15 నిమిషాల్లో రెడీ..

పాస్‌ పుస్తకం పొందవచ్చు ఇలా...
రైతు తప్పనిసరిగా వెబ్‌ ల్యాండ్‌లో ఖాతాదారుగా నమోదు చేసుకుని ఉండాలి. అలాగే ఆధార్‌ సంఖ్యను వెబ్‌ ల్యాండ్‌ సంఖ్యతో అనుసంధానం చేయించుకోవాలి. రైతు లేదా పట్టాదారు సమీప మీ సేవ కేంద్రాన్ని సందర్శించి దరఖాస్తు పత్రాన్ని పూరించి వారి వేలిముద్ర వేయడం ద్వారా భూమి రికార్డును ప్రమాణీకరించుకుని పట్టాదారు పాస్‌పుస్తకం పొందాలి. గ్రామ ప్రాతిపదికన వెబ్‌ల్యాండ్‌లో ఉన్న ఖాతా ఆధార్‌ సంఖ్యతో పట్టాదారు పాస్‌పుస్తకం ముద్రిస్తారు. సంబంధిత రైతు భూమి వివరాలు మాత్రమే ఈ పాస్‌పుస్తకంలో ముద్రిస్తారు. మీ సేవ ద్వారా జారీ చేయబడే ప్రతీ పాస్‌పుస్తకానికి క్యూఆర్‌ కోడ్‌ ఇవ్వబడుతుంది.

ప్రత్యేక ఆండ్రాయిడ్‌ యాప్‌
భూ శోదక్‌ అనే ఆండ్రాయిడ్‌ యాప్‌ను పట్టాదారు పాస్‌పుస్తకం కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. పాస్‌పుస్తకంలో ఉన్న క్యూఆర్‌ కోడ్‌ చిహ్నంను స్కాన్‌ చేస్తే ఆకు పచ్చ టిక్‌ మార్క్‌ పత్రం నిజమైనదని రఽధువీకరిస్తుంది. మీ సేవ ద్వారా జారీ చేసే పాస్‌ పుస్తకం, యునిక్‌ నెంబర్‌, క్యూఆర్‌ కోడ్‌ తప్పనిసరిగా ఇస్తారు. తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకం చేయబడిన భూరికార్డులు మాత్రమే మీ సేవ ద్వారా పొందేందుకు అవకాశం ఉంది. ముద్రించబడిన టైటిల్‌ డీడ్‌ నందు తహసీల్దార్‌ సంతకం ఉండేది చెల్లుబాటు కాదు.

రైతు శ్రేయస్సే ధ్యేయంగా..
తప్పనిసరిగా దరఖాస్తుదారుడు బయోమెట్రిక్‌ వేయాలి. అన్నదాతలు మీ సేవలో రూ.25లు రుసుం చెల్లిస్తే పీడీఎఫ్‌ రూపంలో సాగు పుస్తకం ప్రింట్‌ పొందవచ్చు. తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకం ఉండడంతో ఈ పాస్‌పుస్తకం చెల్లుబాటు అవుతుంది. వెబ్‌ల్యాండ్‌, అడంగళ్‌ సరిపోల్చి వాటిని కూడా కోడ్‌ రూపంలో ఉంచి ఎలక్ర్టానిక్‌ టైటిల్‌ డీడ్‌ కమ్‌ పట్టాదారు పాస్‌పుస్తకంగా పరిగణిస్తారు. ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వేలిముద్ర దరఖాస్తులు 11 వచ్చాయి. 923 వేలిముద్రలు ద్వారా మీ సేవలో పాస్‌పుస్తకాలు రైతులకు అందించాం.
- ఎంవి తిలక్‌, తహసీల్ధార్‌