Tuesday, 23 January 2018

గోడు వినరు.. గూడు కట్టరు!

గోడు వినరు.. గూడు కట్టరు!
Jan 23, 2018, 02:19 IST
 Rehabilitation process in telangana  - Sakshi
ప్రధాన ప్రాజెక్టుల కింద పదేళ్లయినా పూర్తి కాని పునరావాస పనులు

అరిగోస పడుతున్న నిర్వాసితులు

ఇల్లు లేక కొందరు.. ఉన్నా వసతుల్లేక ఎందరో..

పలు కాలనీల్లో తాగునీరు, కరెంట్‌కు కటకట

84 ముంపు గ్రామాల్లో సామాజిక సర్వే పూర్తయింది 77 గ్రామాల్లోనే

44,794 నిర్వాసితుల్లో 24,891 మంది మాత్రమే తరలింపు 

35,385 ఇళ్లకుగానూ పూర్త్తయింది కేవలం 16,859

సాక్షి, హైదరాబాద్‌ :  ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో నిర్వాసితుల వెతలు మాత్రం తీరడం లేదు! ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద సహాయ, పునరావాస ప్రక్రియ పదేళ్లయినా ఇంకా సాగుతూనే ఉంది. మిడ్‌ మానేరు, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, ఇందిరమ్మ వరద కాల్వ వంటి ప్రాజెక్టుల కింద సహాయ, పునరావాస పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నా... పునరావాస ప్రక్రియ మాత్రం నత్తనడకను తలపిస్తోంది. నిధుల కేటాయింపు, పట్టాల పంపిణీ, గృహ వసతి కల్పన, ఇప్పటికే నిర్మించిన పునరావాస కాలనీల్లో వసతుల లేమి.. ఇలా ఒక్కటేమిటీ అన్నింటా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కనిపిస్తోంది.

ఇళ్లు కట్టేది ఇంకెప్పుడు?
పద్నాలుగేళ్ల క్రితం చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ, ఎస్సారెస్పీ స్టేజ్‌–2, దేవాదుల, వరద కాల్వ, ఎల్లంపల్లి, సుద్దవాగు, కొమురం భీం, గొల్లవాగు, నీల్వాయి, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టు కింద 65 గ్రామాలు పూర్తిగా, 19 పాక్షికంగా కలిపి మొత్తంగా 84 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ గ్రామాలలో 44,794 మంది నిర్వాసితులవుతున్నారు. వీరందరికీ పునరావాస (ఆర్‌అండ్‌ఆర్‌) కేంద్రాలు ఏర్పాటు చేసి.. గృహాల నిర్మాణం, రోడ్లు, తాగునీరు, కరెంట్‌ కనెక్షన్‌ల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి.

అయితే ఇప్పటివరకు 84 ముంపు గ్రామాలకుగానూ 77 గ్రామాల్లోనే సామాజిక ఆర్థిక సర్వే (ఎస్‌ఈఎస్‌) పూర్తయింది. 44వేల పైచిలుకు మందిలో 24,891 మందిని మాత్రమే ఇప్పటివరకు పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరికోసం 16,859 నివాస గృహాలను నిర్మించారు. ఇంకా 18,526 గృహాలు, ఇతర వసతుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. దీనికోసం మరో రూ.1,262 కోట్ల మేర నిధులు అవసరం కానున్నాయి. అయితే ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో ఎప్పటిలోగా పునరావాసం పూర్తవుతుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది.


ప్రాజెక్టుల కింద అన్నీ సమస్యలే..
రానున్న జూన్‌ నాటికి పనులు పూర్తి చేసి సాగుకు నీటిని అందించాలని భావిస్తున్న ప్రాజెక్టుల్లో పాలమూరు జిల్లా ప్రాజెక్టులు కీలకం. ఇక్కడి భీమా ప్రాజెక్టు కింద 8 ముంపు గ్రామాలుండగా, మొత్తంగా 6,156 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. అయితే ఇందులో 3,500 మందికి మాత్రమే పట్టాల పంపిణీ పూర్తయింది.

మౌలిక వసతుల పనులు ఇంకా మధ్యలోనే ఉన్నాయి. కనాయిపల్లి, శ్రీరంగాపూర్, నేరేడ్‌గావ్, భూత్పూర్, ఉజ్జెల్లి గ్రామాలలో నిర్వాసితులకు గృహాల నిర్మాణం వేగిరం చేయాల్సి ఉంది. సంగంబండలో ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. నెట్టెంపాడు కింద ముంపునకు గురయ్యే చిన్నానిపల్లి, ఆలూర్, రేతామ్‌పాడ్‌ గ్రామాల నిర్వాసితులకు పట్టాలు ఇచ్చినప్పటికీ అక్కడ ఈ ఏడాది చివరికి రోడ్లు, నీరు, విద్యుత్‌ సదుపాయాలు సమకూర్చాల్సి ఉంది.

కాలనీల్లో వసతులేవీ..?
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 25 టీఎంసీల సామర్థ్యంతో మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మిస్తుండగా, బోయినపల్లి మండలంలో కొదురుపాక, వరదవెల్లి, నీలోజిపల్లి, శాభాష్‌పల్లి, తంగళ్లపల్లి మండలంలో చీర్లవంచ, చింతలఠాణా, వేములవాడ రూరల్‌ మండలంలో అనుపురం, రుద్రవరం, కొడుముంజ, సంకెపెల్లి గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఆయా గ్రామాల్లో 11,731 కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయి.

వీరందరికి పునరావాసం కోసం సుమారు రూ.100 కోట్లతో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలు ఏర్పాటు చేశారు. ఒక్కో నిర్వాసిత కుటుంబానికి 242 చదరపు గజాల ఇంటి స్థలం ఇచ్చారు. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో సుమారు మూడు వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. మరో 1,500 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇదే ప్రాజెక్టు కింద కొదురుపాక, నీలోజిపల్లి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో రూ.80 లక్షల అంచనాలతో నీటి పథకాలు నిర్మించారు. అయితే సీసీ రహదారులు నిర్మించాక పైప్‌లైన్లు వేయడానికి కందకాలు తవ్వారు. కొన్ని చోట్ల రోడ్లు బ్లాస్ట్‌ చే«శారు. దీంతో పలు సీసీ రహదారులు పగుళ్లు బారాయి.

ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల అనాలోచిత చర్యతో శాభాష్‌పల్లి వాగులో నీటి వసతి కోసం మంచినీటి బావులు తవ్వించారు. అయితే వాగులో నీరు చేరడంతో బావులు మునిగిపోయాయి. రోడ్డు నిర్మాణంలో పైప్‌లైన్‌ వ్యవస్థ ఛిన్నాభిన్నం అయింది. దీంతో పునరావాస కాలనీల్లో నీరు దొరక్క నిర్వాసితులు పుట్టెడు కష్టాలు ఎదుర్కొంటున్నారు. పలు పునరావాస కాలనీల్లో నిర్వాసితులకు ఇళ్లను అప్పగించడంలో తీవ్ర జాప్యం వల్ల మురుగు కాలువలు మట్టి, పిచ్చి చెట్లతో పూడుకు పోయాయి. పలుచోట్ల విద్యుత్‌ సదుపాయం లేక నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారు.

అరిగోస పడుతున్నారు
మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి నీరు చేరిందని.. పునరావాస కాలనీలకు తరలాలని అధికారులు ఆదేశించడంతో కట్టు బట్టలతో ఊళ్లు వదిలి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలకు చేరాము. ఇక్కడ నీటి వసతి లేదు. వాగులో బావులు తవ్వితే మునిగి పోయాయి. సీసీ రోడ్లు పగుళ్లు బారాయి. మౌలిక వసతులు లేక నిర్వాసితులు అరిగోస పడుతున్నారు.     – కూస రవీందర్, ముంపు గ్రామాల ఐక్యవేదిక అధ్యక్షుడు

ఇళ్ల బిల్లులు చెల్లించలేదు
సంగంబండ ఆర్‌ఆర్‌ సెంటర్‌లో ఇళ్లు కట్టుకోవాలంటే బిల్లులు ఇవ్వడంలేదు. జీవో విడుదల చేసి సంవత్సరాలు గడిచినా కొంతమందికి ప్లాట్లు రాలేదు. సర్వం కోల్పోయిన తమను ఆదుకుంటామని చెప్పడం తప్ప సమస్యలు పరిష్కరించడంలేదు.      – అనంతరెడ్డి, సంగంబండ, బీమా ప్రాజెక్టు నిర్వాసితుడు

ఇంటి నిర్మాణ బిల్లులు చెల్లించాలి
ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో వేల మంది నిర్వాసితులు రూ.లక్షలు వెచ్చించి ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసిన వారికి బిల్లులు విడుదల చేయాలి.  – ఆడెపు రాజు, వరదవెల్లి, మిడ్‌మానేరు నిర్వాసితుడు

No comments:

Post a Comment