సమరమా.. సఖ్యతా!
29-01-2017 01:33:37
ఆర్కే కొత్తపలుకు
గుంపుస్వామ్యంలో పడి ప్రజలు కొట్టుకుపోతున్నప్పుడు వారిని హెచ్చరించడం మీడియా బాధ్యత. ఇలాంటి సందర్భాలలో నిందలు భరించాల్సి రావచ్చు. అయినా జంక కూడదన్నది నా అభిప్రాయం. అందుకే గతంలో కూడా ఉద్యమించడం కాకుండా, ఏపీ హక్కుల కోసం పోరాడాలని సూచించా. అప్పుడు సమైక్య ఉద్యమంలో కనిపించిన ముఖాలే అటూ ఇటుగా ఇప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమంలోనూ కనబడుతున్నాయి. ఇప్పుడు ఏపీ ప్రజలు పోరాడాల్సింది రాని, ఉపయోగం లేని ప్రత్యేక హోదా కోసం కాదు. ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని పోరాటం చేయాలి.
ప్రత్యేక హోదా పేరిట ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో జల్లికట్టు ఆటను నిషేధించడాన్ని నిరసిస్తూ వేల మంది యువత మెరీనా బీచ్‌ను ఆక్రమించడాన్ని స్ఫూర్తిగా తీసుకుని విశాఖపట్టణంలోని ఆర్.కె. బీచ్‌లో కూడా తెలుగు యువత నిరసన వ్యక్తంచేయాలని ప్రతిపక్షాలు పోటీపడి పిలుపులు ఇచ్చాయి. ముందుగా ఈ తరహా పిలుపు ఇచ్చింది జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాగా, తానెక్కడ వెనుకబడిపోతానోనని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డి ఆ వెంటనే రంగంలోకి దిగారు. తమిళ సినిమాలను కాపీ కొట్టే మన తెలుగు హీరోలు ఉద్యమాలను కూడా కాపీ కొట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. జల్లికట్టు ఉద్యమానికి తమిళ సినిమా పరిశ్రమ మద్దతు ప్రకటించడంతో, ప్రత్యేక హోదా గురించి సరైన అవగాహన కూడా లేని కొంతమంది తెలుగు హీరోలు, ఇతర ప్రముఖులు అదే దారిలో విశాఖ తీరంలో తలపెట్టిన నిరసనలకు మద్దతు ప్రకటించారు. ముష్టిలో వీర ముష్టి అన్నట్టుగా తమిళ ఉద్యమాన్ని కాపీ కొట్టడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తే, ఆయన ఇచ్చిన పిలుపును ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డి కాపీ కొట్టారు. ఎవరిని ఎవరు కాపీ కొట్టారన్న విషయం పక్కనపెడితే, గణతంత్ర దినోత్సవం రోజున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ప్రతిపక్షాలు భావించడం వ్యూహాత్మక తప్పిదమనే చెప్పాలి. అంతే కాకుండా పెట్టుబడుల కోసం విశాఖలో ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ నిర్వహిస్తున్న సమయంలోనే నిరసనల ద్వారా ఉద్రిక్తతలు సృష్టించాలనుకోవడం ప్రతిపక్షాల బాధ్యతారాహిత్యమే అవుతుంది.
నిజానికి ప్రత్యేక హోదా అనేది ఏపీలో ముగిసిపోయిన అధ్యాయం. పాచిపోయిన నినాదాన్ని అందిపుచ్చుకుని బల ప్రదర్శనకు ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా ఇవ్వవచ్చుననీ, అలా ఇచ్చినా ఉపయోగం కూడా ఏమీ ఉండకపోవచ్చుననీ 14వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా పనిచేసిన యాగా వేణుగోపాల్‌రెడ్డి ఇటీవలే స్పష్టంచేశారు. వాస్తవానికి ప్రత్యేక హోదా పొందే అర్హతలు ఏపీకి లేవు. ఈ విషయాన్ని నేను గతంలోనే స్పష్టంచేశాను. కొండ ప్రాంతాలతో కూడి ఉండి, ఆర్థికంగా కునారిల్లే రాష్ర్టాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇచ్చారు. అంతమాత్రాన అక్కడ పరిశ్రమలు ఏర్పాటైఆ రాష్ర్టాల ఆర్థిక పరిస్థితులు ఏమీ మెరుగుపడలేదు. సొంత వనరులు లేని ఆ రాష్ర్టాలు కేంద్రం ఇచ్చే నిధులపై ఆధారపడి రోజులు నెట్టుకొస్తున్నాయి గానీ అభివృద్ధి పథంలో దూసుకెళ్లడం లేదు. పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు లభించాలంటే హోదాతో పాటు ప్రత్యేకంగా మరో నోటిఫికేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి వెసులుబాటు పొందిన ఉత్తరాఖండ్‌లో రాయితీల కోసం బోగస్ కంపెనీలు ఏర్పాటు అయ్యాయి. తెలుగు రాష్ర్టాలకు చెందిన కొన్ని ఫార్మా కంపెనీలు కూడా అక్కడ బ్రాంచ్‌లను మాత్రమే తెరిచి కంపెనీలు పెట్టినట్టుగా రికార్డులలో చూపించి రాయితీలు పొందాయే గానీ పెట్టుబడులు పెట్టిందీ లేదు-– ఉద్యోగాల కల్పన చేసిందీ లేదు.
ఈ కారణంగానే ఉత్తరాఖండ్ ఇప్పటికీ వెనుకబడి ఉంది. నిజంగా పరిశ్రమలు ఏర్పాటుచేసేవారు హోదా ఉందా లేదా అని చూడరు. ఇప్పుడు దేశంలో పారిశ్రామికంగా, వ్యాపారపరంగా అభివృద్ధి చెందిన ఏ రాష్ర్టానికికూడా ప్రత్యేక హోదా లేదు. వ్యాపారానికి, వస్తు ఉత్పత్తికి అనుకూలతలు ఉండటంతో పాటు లాభాలు వస్తాయనుకున్నప్పుడే ఏ పారిశ్రామికవేత్త అయినా పెట్టుబడులు పెడతారు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డి కూడా ఏ హోదా లేకపోయినా కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేశారు. కర్ణాటకలో విద్యుత్ కేంద్రం నెలకొల్పారు.
విపక్ష స్థానానికీ ముప్పొస్తే..
అయినా మరుగునపడిపోయిన ప్రత్యేక హోదా నినాదం ఇప్పుడు మళ్లీ తెర మీదకు ఎందుకు వచ్చినట్టు? ఇందుకు కారణం ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ప్రధానం అని స్పష్టంగా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. జగన్ సొంత మీడియా మినహా మిగతా మీడియాలో ఆయన వార్తలకు తగిన ప్రాధాన్యం లభిస్తోంది. ఈ పరిణామం అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీ కంటే ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ ఇబ్బందికి గురిచేస్తోంది. పవన్ కల్యాణ్‌కు తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఇంకా పూర్తిస్థాయిలో దెబ్బతినలేదు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను పవన్ కల్యాణ్ హైలైట్ చేయగానే చంద్రబాబు ప్రభుత్వం స్పందించింది. వైద్యపరంగా కొన్ని చర్యలు చేపట్టింది. దీంతో ప్రభుత్వంతో సమస్యలు ఉన్నవారు పవన్ కల్యాణ్‌ను ఆశ్రయించడం మొదలుపెట్టారు. ప్రతిపక్ష నాయకుడైన తన వద్దకు రాకుండా సమస్యలు చెప్పుకోవడానికి పవన్ కల్యాణ్ వద్దకు ప్రజలు వెళ్లడం జగన్మోహన్‌రెడ్డిని సహజంగానే కలవరానికి గురిచేసింది.
పరిస్థితులు ఇలాగే కొనసాగితే తన ప్రతిపక్ష స్థానానికే ప్రమాదం ముంచుకువస్తుందని జగన్మోహన్‌రెడ్డి ఆందోళనకు గురై ఉంటారు. దీంతో ఏపీలో ప్రతిపక్ష పాత్ర కోసం పోటీ మొదలయ్యింది. దీని పర్యవసానమే విశాఖ తీరంలో తలపెట్టిన నిరసన ఉద్యమాలు. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం సక్సెస్ కావడంతో అదే తరహాలో ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం చేపట్టాలని పోటీపడటం మొదలయ్యింది. తమిళ ప్రజలు రెండు రోజుల్లోనే జల్లికట్టు ఆటకు అనుమతి పొందగా లేనిది, మనం ప్రత్యేక హోదా కోసం ఉద్యమించి సాధించుకోలేమా? అని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తొలుత పిలుపు ఇచ్చారు. అయితే ఏపీలో అవశేషంగా మాత్రమే మిగిలి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ పిలుపును ఉపయోగించుకోలేకపోయింది. కేవీపీ పిలుపును ప్రజలు కూడా పట్టించుకోలేదు. పవన్ కల్యాణ్ మాత్రం స్పందించారు.
ప్రత్యేక హోదా కోసం మీరు విశాఖ తీరంలో నిరసన చేపడితే నేను మద్దతు ఇస్తానని ట్విట్టర్ ద్వారా యువతకు పిలుపు ఇచ్చారు. ఈ అంశం మీడియాలో ప్రముఖంగా రావడంతో ఉలిక్కిపడిన ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి, తానెక్కడ వెనుకబడిపోతానోనని విశాఖ తీరంలో రిపబ్లిక్ డే రోజున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. ఉద్యమాలు కోరుకునే కమ్యూనిస్టు పార్టీలు మేం కూడా అంటూ స్పందించాయి. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలు భిన్న మార్గాలలో పయనిస్తున్నాయి. సీపీఐ నాయకులు జనసేన పార్టీతో కలిసి పయనించడానికి మొగ్గు చూపుతుండగా, సీపీఎం నాయకులు మాత్రం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌తో జత కట్టడానికి ఉత్సాహపడుతున్నారు. ఈ రాజకీయ పార్టీలతోపాటు కొన్ని స్వయం ప్రకటిత సంఘాలు, వాటి నాయకులుగా చలామణి అవుతున్నవారు కూడా ప్రత్యేక హోదా పాటను అందిపుచ్చుకున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కేవలం విశాఖ తీరాన్ని వేదికగా ఎంచుకోగా, జగన్మోహన్‌రెడ్డి విశాఖతోపాటు విజయవాడ, తిరుపతిలో కూడా నిరసనలకు పిలుపు ఇచ్చారు. ఇందులో తమ పాత్ర ఏమీ లేకుండాపోతున్నదని ఆందోళనకు గురైన కాంగ్రెస్ పార్టీ, గాంధీ విగ్రహాల వద్ద మౌనదీక్షలకు పిలుపు ఇచ్చింది. మొత్తానికి ప్రతిపక్షాలన్నీ కలివిడిగా, విడివిడిగా వాంఛనీయం, సమర్థనీయం కాని రోజును, ప్రాంతాన్ని నిరసనలకు ఎంచుకోవడంతో ప్రభుత్వం కూడా కఠినంగానే వ్యవహరించింది. ఫలితంగా విశాఖ తీరంలో ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, నిరసనలకు అవకాశం మాత్రం లేకుండా పోయింది.
అదే శాపం!
ఈ మొత్తం క్రీడలో విషాదం ఏమిటంటే ఏపీ ప్రజల ప్రయోజనాలు బలి కావడం! అదేమి శాపమో గానీ గతంలోనూ, ప్రస్తుతం కూడా సీమాంధ్రులను తప్పుదారి పట్టించే నాయకులే వారికి లభిస్తున్నారు. తమిళనాడు నుంచి వేరుపడినప్పుడు మద్రాస్ నగరం కూడా కావాలని కోరడంతో తమిళుల ఆగ్రహానికి గురయ్యారు. అప్పుడే అలాంటి విపరీత కోరిక కోరే బదులు రాజధాని లేని తమకు న్యాయం చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరి సహాయం పొంది ఉండవలసింది. అలా జరగకపోవడంతో కర్నూలు రాజధానిగా గుడారాలు వేసుకుని పాలన సాగించారు. గుడారాలలో ఎంత కాలం ఉంటామనుకుని హైదరాబాద్‌పై కన్నేసి తెలంగాణవారితో కలిసిపోయారు. అప్పుడే పట్టుదలగా కష్టపడి ఉంటే ఏపీ ఇవ్వాళ ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. హైదరాబాద్ రాజధానిగా ఏర్పడిన ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించిన సీమాంధ్ర నాయకులు తమ దృష్టినంతా హైదరాబాద్‌పైనే కేంద్రీకరించి సీమాంధ్ర అభివృద్ధిని విస్మరించారు. ఫలితంగానే ఎంతో అవకాశం ఉన్నప్పటికీ విశాఖ నగరం అంతగా అభివృద్ధి చెందలేదు. ఈ క్రమంలోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రావడం, పుష్కరం పాటు పాలకుల ప్రాధాన్యాలు తెలంగాణకే పరిమితం కావడం జరిగింది.
చివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించినప్పుడు కూడా హేతుబద్ధంగా ఆలోచించి సాధించుకోవలసిన వాటి గురించి ఆలోచించకుండా హైదరాబాద్ కావాలని కొన్ని రోజులు, సమైక్య రాష్ట్రమే ముద్దు అంటూ కొన్ని రోజులు వృథా చేసుకున్నారు. సమైక్య ఉద్యమం జోరు మీద ఉన్నప్పుడు కూడా ‘విభజన అనివార్యం- మీకు కావలసిన వాటి కోసం పోరాడండి’ అని నేను స్పష్టంగా సూచించాను. అప్పుడు ఇటువంటి హితోక్తులు ఎవరి చెవికీ ఎక్కలేదు. సమైక్య ఉద్యమానికి ఒక వర్గం మీడియా వంత పాడటమే కాకుండా ఏపీకి రావలసిన వాటి గురించి మాట్లాడటానికి ప్రయత్నించిన నాయకులను ఎగతాళి చేస్తూ ప్రసారాలు చేసింది. చివరకు ఏమైంది? ఏమీ సాధించుకోకుండానే విడిపోవలసి వచ్చింది. నష్టపోయింది ఎవరు? నాయకులు కాదు-– ప్రజలే! ప్రత్యేక హోదా ఏమి ఖర్మ- ఆ రోజున ఏమి కావాలన్నా ఇవ్వడానికి సోనియాగాంధీ మానసికంగా సిద్ధపడ్డారు. కానీ ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా కొంతమంది నాయకులు, ఒక వర్గం మీడియా కలిసి అడ్డుకున్నాయి. దీంతో దిక్కూదివాణం లేకుండా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నదేమిటి? కులాల కుమ్ములాటలు, వర్గ పోరు! పరిశ్రమల ఏర్పాటు కోసం హోదా కోరుతున్నామని గొంతు చించుకుంటున్నవారు పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తున్నామా? లేదా? అని గుండె మీద చేయి వేసుకుని ఆలోచించుకోవాలి. అధికారంలో ఇవ్వాళ చంద్రబాబు ఉండవచ్చు. రేపు మరొకరు ఉండవచ్చు. కానీ ఏపీ అభివృద్ధికి ఇప్పుడు పడే పునాదే ఆ రాష్ట్ర భవిష్యత్తుకు ప్రధానం అవుతుంది. సకల హంగులతో అలరారుతున్న హైదరాబాద్‌ను కాదని ఎవరైనా ఏపీలో పరిశ్రమలు పెట్టాలంటే ఆషామాషీగా జరగదు.
దీనికి ఎంతో కృషి అవసరం. భాగస్వామ్య సదస్సు పేరిట వివిధ రాష్ర్టాల పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి పోటీపడుతున్న నేపథ్యంలో పాచిపోయిన నినాదాలతో ఉద్రిక్తతలు సృష్టించడం ఏపీ అభివృద్ధికి సహకరించడం అవుతుందా? నిర్దిష్టమైన ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెళ్లేటట్టు చేసి, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న పవన్ కల్యాణ్ కూడా ప్రత్యేక హోదా విషయంలో తొందరపడ్డారేమోనని అనిపిస్తోంది. చంద్రబాబును, ఆయన ప్రభుత్వాన్ని తప్పుబట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటిని కాదనుకుని కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడమని ఒత్తిడి తేవడం ఏపీ ప్రజలకు ద్రోహం చేయడమే అవుతుంది.
అండ లేకుండా అయ్యే పనేనా?
ప్రతిపక్షాలు కోరుతున్నట్టుగా తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణకు దిగుతుందనే అనుకుందాం. అప్పుడు ఏమి జరుగుతుంది? ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా? ఒకవేళ ఇచ్చినా ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందా? పోలవరం ప్రాజెక్టు పూర్తికి సకాలంలో నిధులు అందిస్తుందా? ప్రత్యేక హోదా మాత్రమే కావాలని మంకుపట్టుపట్టి ఉంటే పోలవరం ప్రాజెక్టు కోసం సుమారు 16 వేల కోట్ల రూపాయలు నాబార్డు ద్వారా మంజూరు చేసి ఉండేవారా? తొలి ఏడాది బడ్జెట్‌లో పెట్టినట్టుగా ఏటా వంద కోట్లు లేదా రెండు వందల కోట్లు ఇస్తూ పోయేవారు. అదే జరిగితే ఈ తరమే కాదు వచ్చే తరం కూడా ఆ ప్రాజెక్టు పూర్తికావడాన్ని చూసేది కాదు. ప్రత్యేక హోదా ఉండే రాష్ర్టాలలో విదేశీ ఆర్థిక సహకారంతో చేపట్టే ప్రాజెక్టులు, పథకాల భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. హోదా ప్రకటించకపోయినా ఏపీకి ఈ వెసులుబాటు ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ వెసులుబాటును ఉపయోగించుకుని ఏపీలో పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేసి కేంద్రం ఆమోదం పొందడానికి కృషి చేయాలే గానీ హోదా ఇస్తే చాలు అని ప్రజలను తప్పుదారి పట్టించడం సమర్థనీయం కాదు. హోదా ఇచ్చినా విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలపకపోతే ఏమిటి పరిస్థితి? ఇదంతా ఎందుకు-– ఏపీ ఇప్పుడున్న పరిస్థితులలో కేంద్రంతో ఘర్షణకు దిగి మనుగడ సాగించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ మనస్తత్వం తెలిసినవారెవ్వరూ ఆయనతో సున్నం పెట్టుకోవాలని సూచించరు. బిహార్ ఎన్నికల సందర్భంగా లక్షా 45 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన నరేంద్ర మోదీ ఆ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడంతో ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు.
అధికారంలోకి వచ్చిన కొత్తలో ‘మోదీ లేదు- గీదీ లేదు’ అని వ్యాఖ్యానించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తత్వం బోధపడిన తర్వాత, ప్రధానితో స్నేహంగా ఉంటున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేకపోయినా నరేంద్ర మోదీతో గొడవ ఎందుకన్న ఉద్దేశంతో ఆయన నిర్ణయాన్ని కేసీఆర్ బాహాటంగా సమర్థించారు. నిజానికి కేంద్ర సహకారం లేకపోయినా తెలంగాణ రాష్ట్రం మనుగడ సాగించగలదు. అయినా కేంద్రం నుంచి గరిష్ఠంగా సహాయం పొందాలన్న దృక్పథంతో కేసీఆర్ తన వైఖరి మార్చుకున్నారు. విజ్ఞతతోపాటు రాష్ర్టాభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్నవారు ఎవరైనా ఇదే చేస్తారు. ఏపీ ప్రజలారా... ఇప్పుడు చెప్పండి కేంద్రంతో యుద్ధం చేసి నష్టపోవడమా? సఖ్యతతో మెలుగుతూ రాష్ర్టానికి కావలసిన వాటిని సాధించుకోవడమా? నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉంది.
కులంపై గళమెత్తాలి!
ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను చూసి పొరుగున ఉన్నవారు నవ్వుకునే పరిస్థితులు తెచ్చుకోవద్దు. ఇప్పటికే సీమాంధ్రను వదిలించుకుని మంచి పని చేశామనీ, లాభపడ్డామనీ తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ‘ముఖ్యమంత్రి మీదే చేయి వేస్తారా’ అని పోలీసు అధికారులపై మండిపడ్డ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డి లక్ష్యం ముఖ్యమంత్రి కావడమే! ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుకోవడం కూడా తప్పు కాదు. ఏ రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యమైనా అధికారంలోకి రావడమే. అయితే ముఖ్యమంత్రిని అని భ్రమల్లో జీవించడమే అవివేకం. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం మాట తప్పిన విషయం వాస్తవం. అందుకు ప్రత్యామ్నాయంగా గరిష్ఠంగా సహాయం చేస్తామని చెబుతున్నప్పుడు అందిపుచ్చుకోవాలా? లేదా? అనేది ఏపీ ప్రజలే నిర్ణయించుకోవాలి. విభజన చట్టంలో పేర్కొన్న పలు విద్యాసంస్థలతోపాటు, ఇతర సంస్థలను నెలకొల్పడానికి ఇప్పటివరకు కేంద్రం చురుగ్గానే పనిచేస్తోంది. చట్టంలో పేర్కొన్నంత మాత్రాన ఆయా సంస్థలను వెంట వెంటనే ఏర్పాటుచేయాలని ఏమీ లేదు. పదేళ్లలో ఏర్పాటు చేయాలని చట్టంలోనే ఉంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని ప్రత్యేక హోదా విషయంలో విమర్శించేవారు ఉండవచ్చు గానీ, కేంద్రం నుంచి ఏపీకి సహాయం సాధించుకురావడంలో ఆయన కృషిని మాత్రం విస్మరించలేం! కేంద్ర ప్రభుత్వంలో ఉండే అధికారులకు ఏపీ పట్ల ప్రత్యేక శ్రద్ధ గానీ, నష్టపోతారన్న ఆవేదన గానీ ఎందుకుంటుంది? వారి వెంటపడి పనులు చేయించుకోవలసిన బాధ్యత ఏపీ ప్రజాప్రతినిధులపైనే ఉంటుంది.
రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయడం సహజం. అది వాటి హక్కు కూడా! అయితే ఎవరు ఏ రాజకీయం చేసినా ప్రజాప్రయోజనాలకు విఘాతం కలగకూడదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందడానికి ప్రయత్నించే బదులు వాస్తవాలను తెలుసుకుని వివరించి చెప్పడం బాధ్యతగల మీడియా విధి. భావోద్వేగాలు ఏర్పడినప్పుడు హితోక్తులు చెవికి ఎక్కవు. అయినా గుంపుస్వామ్యంలో పడి ప్రజలు కొట్టుకుపోతున్నప్పుడు వారిని హెచ్చరించడం మీడియా బాధ్యత. ఇలాంటి సందర్భాలలో నిందలు భరించాల్సి కూడా రావచ్చు. అయినా జంక కూడదన్నది నా అభిప్రాయం. అందుకే గతంలో కూడా ఉద్యమించడం కాకుండా, ఏపీ హక్కుల కోసం పోరాడాలని సూచించా. అప్పుడు సమైక్య ఉద్యమంలో కనిపించిన ముఖాలే అటూ ఇటుగా ఇప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమంలోనూ కనబడుతున్నాయి. దీన్నిబట్టి ఎవరికి నష్టం జరగబోతున్నదో ప్రజలే తెలుసుకోవాలి. ఇప్పుడు ఏపీ ప్రజలు పోరాడాల్సింది రాని, ఉపయోగం లేని ప్రత్యేక హోదా కోసం కాదు. ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని పోరాటం చేయాలి. జల్లికట్టు అనేది ఒక ప్రాంతానికి చెందిన సంప్రదాయం. అందువల్లనే తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సరేనంది. ప్రత్యేక హోదా అలాంటిది కాదు.
ఈ విషయంలో ఏపీ ఒత్తిడికి కేంద్రం తలొగ్గితే పలు ఇతర రాష్ర్టాలు తమకూ ప్రత్యేక హోదా కావాలని పట్టుబడతాయి. ఆ రాష్ర్టాలలో కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి కనుక వాటిని ఫణంగా పెట్టి మన కోరిక తీర్చే అవకాశం ఉండదు. రాజకీయ పార్టీలు కూడా ఏపీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తాత్కాలిక ప్రయోజనాల కోసం నోటికొచ్చినట్టు హామీలు ఇవ్వకుండా స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. అవసరానికి హామీలు ఇచ్చి ఆ తర్వాత విస్మరించడం వల్లనే దేశంలో రాజకీయ పార్టీల విశ్వసనీయత దెబ్బతింటోంది. ఆందోళనలు, ఉద్యమాల వల్ల ఏపీ భవిష్యత్తు దెబ్బతింటుంది. సామాజిక సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండటంతోపాటు ప్రజలకు మంచి జరగాలన్న చిత్తశుద్ధి ఉన్న పవన్ కల్యాణ్ రొటీన్ తరహా రాజకీయాల నుంచి బయటకు వస్తే ఆయనకే మంచిది. అధికారంలోకి రావడం తనకు ముఖ్యం కాదనీ, ప్రజలకు న్యాయం జరగాలన్నదే తన అభిమతమనీ పవన్ తరచుగా అంటూ ఉంటారు. అదే నిజమైతే ఏపీని పట్టి పీడిస్తున్న కుల విద్వేషాలను అరికట్టడానికి ఆయన చొరవ తీసుకుంటే ఏపీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఏపీ అభివృద్ధికి ప్రధాన ఆటంకం అక్కడ నెలకొన్న కులతత్వం-– కుల ద్వేషమని నేను గతంలోనే స్పష్టంచేశాను. ఇప్పుడు దాని పర్యవసానాలను కూడా చూస్తున్నాం.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈ సమస్య పరిష్కారానికి నడుం బిగించాలని కోరుకుందాం! యువతలో ఆయన పట్ల క్రేజ్ ఉంది. దురదృష్టవశాత్తూ యువతలో కూడా కుల జాఢ్యం విస్తరిస్తోంది. చివరకు చిత్ర పరిశ్రమకు కూడా ఇది సోకింది. ఇటీవల విడుదలైన రెండు సినిమాల సందర్భంగా రెండు సామాజికవర్గాలకు చెందిన కొంతమంది యువత అభ్యంతరకర రీతిలో వ్యవహరించడం ఆందోళన కలిగించే అంశం. కళాకారుడికి కులం, మతం, ప్రాంతం ఉండదంటారు. అలాంటిది కళాకారులను కూడా కులం దృష్టితో చూడటం ఒక విషాదం. ఆంధ్రప్రదేశ్‌ను ఈ విషాదం నుంచి బయటపడేయకపోతే నాయకులు బాగానే ఉంటారు గానీ ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. తస్మాత్ జాగ్రత్త!
ప్రత్యేక హోదా మాత్రమే కావాలని మంకుపట్టుపట్టి ఉంటే పోలవరం ప్రాజెక్టు కోసం సుమారు 16 వేల కోట్ల రూపాయలు నాబార్డు ద్వారా మంజూరు చేసి ఉండేవారా? తొలి ఏడాది బడ్జెట్‌లో పెట్టినట్టుగా ఏటా వంద కోట్లు లేదా రెండు వందల కోట్లు ఇస్తూ పోయేవారు. అదే జరిగితే ఈ తరమే కాదు వచ్చే తరం కూడా ఆ ప్రాజెక్టు పూర్తికావడాన్ని చూసేది కాదు. ప్రత్యేక హోదా ఉండే రాష్ర్టాలలో విదేశీ ఆర్థిక సహకారంతో చేపట్టే ప్రాజెక్టులు, పథకాల భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. హోదా ప్రకటించక పోయినా ఏపీకి ఈ వెసులుబాటు ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ వెసులుబాటును ఉపయోగించుకుని ఏపీలో పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేసి కేంద్రం ఆమోదం పొందడానికి కృషి చేయాలే గానీ హోదా ఇస్తే చాలు అని ప్రజలను తప్పుదారి పట్టించడం సమర్థనీయం కాదు. హోదా ఇచ్చినా విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలపకపోతే ఏమిటి పరిస్థితి?
ఏపీ అభివృద్ధికి ప్రధాన ఆటంకం అక్కడ నెలకొన్న కులతత్వం- కులద్వేషమని నేను గతంలోనే స్పష్టంచేశాను. ఇప్పుడు దాని పర్యవసానాలను కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈ సమస్య పరిష్కారానికి నడుం బిగించాలని కోరుకుందాం

No comments:
Post a Comment