Monday, 30 January 2017

పాలేకర్ వ్యవసాయం... ఎకరాకు లక్షల్లో ఆదాయం

పాలేకర్ వ్యవసాయం... ఎకరాకు లక్షల్లో ఆదాయం
20-02-2016 14:53:48
http://www.andhrajyothy.com/artical?SID=209046

దున్నువాడు దుశ్శాసనుడు. దున్నమనేవాడు ధుర్యోధనుడు. ఆపగలిగీ ఆపనివాడు దృతరాష్ట్రుడు. దున్నడం తప్పు అని తెలిసినా చోద్యం చూస్తూ కూర్చున్నవాడు భీష్మాచార్యుడు. వింటున్నది భారతమే కానీ కంటెంట్ ఏమిటి కొంచెం తేడాగా ఉంది? అనుకుంటున్నారా? ఈ కథనం చదివితే అదేంటో మీకే అర్థమవుతుంది.

కాపుగర్జన పుణ్యమా అని మరుగున పడిపోయింది కానీ... తునిలో రైలంటుకునే సమయానికి కాకినాడలో వారంపాటు సాగిన ఒక బృహత్తర కార్యం విజయవంతంగా ముగుస్తూ ఉంది. అదే పాలేకర్ ప్రకృతి వ్యవసాయ శిక్షణ శిబిరం. మొదట్లో అందరూ దీన్ని వ్యవసాయశాఖ డబ్బులు ఖర్చుచేయడం కోసం చేసే తూతూమంత్రపు వ్యవహారమే అనుకున్నారు. మొదటి రెండు రోజులు రాష్ట్రం నలుమూలల నుంచి వ్యవసాయ అధికారుల బలవంతంపై వచ్చిన కొందరు తిరుగుటపాలో వెల్లిపోయారు. కానీ ఉన్నవాళ్లకు మాత్రం మూడో రోజుకల్లా మేటర్ మెదళ్లలోకి చేరింది. పురుగు తొలచినట్టు తొలిచేసింది. 20 ఏళ్ల కుర్రరైతూ, 80 ఏళ్ల వృద్ధరైతూ పెన్నూ పుస్తకం పట్టి పాలేకర్ చెప్పే ప్రతి అక్షరం చెక్కేయడం మొదలెట్టారు. పట్టభద్రులు, వృత్తి నిపుణులూ ఇందుకు మినహాయింపు కాదు.

ఇక వ్యవసాయ అధికారులకైతే మొదటి రెండు రోజులు మొహాన రక్తంచుక్క ఉంటే ఒట్టు. డబ్బులిచ్చి దెబ్బలు తినడం అంటారే అలా అయిపోయింది వారి పని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా కోట్లు ఖర్చుచేసి కార్యక్రమం నిర్వహిస్తోంది. వ్యవసాయశాఖ మంత్రి, స్పెషల్ సీఎస్, డీన్‌లు, సైంటిస్ట్‌లు, జేడీలు, డీడీల దగ్గర నుంచి గ్రామాల్లో తిరిగే అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ల వరకూ అక్కడే ఉన్నారు. పాలేకరేమో ప్రభుత్వాలను, వ్యవసాయ విశ్వవిద్యాలయాలను, అందులో విద్యనభ్యసించి రైతులను ఉద్దరిస్తున్న వ్యవసాయ అధికారులను తిట్టిపోస్తున్నారు. మహా పాపియోం... అంటూ మరాఠాలో శాపనార్థాలు పెడుతున్నారు. ఏం అర్థంకాలేదు చాలా మందికి. కానీ మూడో రోజుకల్లా పాలేకర్ బ్రెయిన్ వాష్‌తో వారిలోనూ ఏదో మార్పు. అవును మనం చేసేది తప్పే అన్న అపరాధ భావన వారి మొహంలో లీలగా కనిపించింది. దీనికి తోడు రైతుల చప్పట్లు, హర్షాతిరేకాలు, ప్రాశంగిక సాక్ష్యాలు, పాలేకర్ పద్ధతిలో ఇప్పటికే విజేతలుగా నిలిచిన వారి అనుభవాలు... అవి చెబుతున్నప్పుడు వారి మొహంలో కనిపిస్తున్న వెలుగులు... వీటిమధ్య అక్కడున్న ఎవ్వరికీ పాలేకర్ చెబుతున్నదాన్ని కాదనే ధైర్యం లేకుండాపోయింది. అంత పగడ్బందీగా ఉన్నాయి పాలేకర్ చెప్పే విషయము, విధానమూను..! కానీ ఎలా?... హౌ ఈజ్ ఇట్ పాజిబుల్? ఇదే ప్రశ్న చాలా మందిలో మొదట్లో ఏర్పడింది. అయితే అయిదురోజుల్లో అక్కడున్న వారిలో నూటికి 90 మందిని పాలేకర్ కన్విన్స్ చేయగలిగారు. చేస్తేగీస్తే ప్రకృతి వ్యవసాయమే చేస్తామని కొందరు... పాలేకర్‌కు వెంటనే ప్రభుత్వం రక్షణ కల్పించాలని కొందరు... ఆయన భారతీయ రైతులోకానికి ఒక వెలుగురేఖ అని మరికొందరు.. కాదు- కాదు అవతార పురుషుడు, దేవుడు అని ఇంకొందరు ప్రశంసల మీద ప్రశంసలు కురిపించారు. అయితే ఇవేమీ ముఖస్తుతి వ్యాఖ్యలు కాదు. గుండెలోతుల్లోంచి ఉప్పొంగిన మాటలు. ఇన్నాళ్లూ తాము వెతుకుతున్నదేదో దొరికిందన్న సంతృప్తి. ఇంతకీ ఆయన చెప్పింది ఏమిటి ? దేన్నీ ఒక పట్టాన అంగీకరించని రైతులను, వ్యవసాయ శాస్త్రవేత్తలను, వ్యవసాయ అధికారులను, ప్రభుత్వాన్ని ఒకే వేదిక నుంచి ఒకే రకమైన ప్రసంగంలో ఎలా ఆయన కన్విన్స్ చేయగలిగారు అన్నది ఆసక్తికర అంశమే!

పాలేకర్ చెప్పేది ప్రకృతి వ్యవసాయం. అంటే అంతా ప్రకృతికి వదిలేసి కూర్చోవడం కాదు. ప్రకృతికి ఎదురెళ్లకుండా ఉండడం. ప్రకృతితో కలిసి నడవడం. పాలేకర్ చెప్పేది ఆధ్యాత్మిక వ్యవసాయం. అంటే మంత్రాలతో చింతకాయలు రాలగొడతారని అనుకుంటే పొరపాటు. ఉదయంపూట భక్తితో పూజచేసి, ఆ తర్వాత రోజంతా పురుగుమందులు పొలంలో చల్లి లక్షలాది జీవరాసులను చంపి, రసాయన అవశేషాలతో కూడిన పంటను ప్రజలకు అందించి... వారికి అనేక కొత్తకొత్త రోగాలు రావడానికి కారణమయ్యి... రాత్రికి తిరిగొచ్చి మళ్లీ ఏ గుడిలోనో భజనచేస్తే పుణ్యం వస్తుందా? ఈ ప్రకృతిలో ఏ జీవీ అకారణంగా మరొక జీవిపై దాడిచేయదు. చంపదు. ఒక్క మనిషి తప్ప! కాదనగలరా?... ఇదీ పాలేకర్ ప్రశ్న. అదే నాస్తికులకైతే... మీరు సాటి మనిషినే అన్నింటికంటే బాగా ప్రేమిస్తారు కదా... మరి ఆ మనిషికి విషంతో కూడిన ఆహారాన్ని పండించి అందిస్తారా ?.. అని అడుగుతారు. పాలేకర్ చెప్పేది జీరో బడ్జెట్ వ్యవసాయం. అంటే పెట్టుబడి లేని వ్యవసాయం అని చాలామంది తప్పుగా అన్వయించుకుంటారు. కానే కాదు. ప్రధాన పంటలో వేసే అంతర పంటల వల్ల వచ్చే ఆదాయం మొత్తం పెట్టుబడికి సరిపోవడం. ప్రధాన పంట పూర్తి లాభంగా రైతుకు చేరడం. తక్కువ పెట్టుబడి కారణంగా ప్రకృతి ప్రకోపిస్తే.... నష్టంలేకుండా బైటపడడం. ఇదీ జీరో బడ్జెట్ అంటే!

పాలేకర్ విధానంలో కొన్నాళ్లకు పంట నీటిని అడగదు. ఎరువు అవసరం లేదు. పురుగుమందుతో పనే లేదు. అలాగని ఇది సేంద్రియ వ్యవసాయం అనుకునేరు. సేంద్రియం అన్న మాట వింటేనే పాలేకర్ మండిపడతారు. ట్రాక్టర్ల కొద్దీ పశువుల ఎరువు తోలాలంటే ఎక్కడనుంచి తెస్తావు. అసలు ఆ అవసరం ఏంటి? అంత ఖర్చెందుకు? అనేది పాలేకర్ ప్రశ్న. భూమి పోషకాల సముద్రమంటారాయన. ఆ పోషకాలను మొక్కకు అనువుగా మార్చి అందించే సూక్ష్మజీవులను మనం ఈ కెమికల్స్ వాడి చంపేస్తున్నామంటారాయన. మన నేలలో సహజసిద్ధంగా ఉండే వానపాములే అతి బలవంతులైన ట్రాక్టర్లు. నేలను దున్నడంతో పాటు అవి వర్షపునీటిని భూమి అడుగు పొరలకు చేర్చడం, వర్షం లేనప్పుడు తమ శరీర తేమద్వారా, కొన్ని రసాయనాల ఉత్పత్తి ద్వారా తేమా, పోషకాలు రెండూ అవి అందిస్తాయని సూత్రీకరిస్తారాయన. భూమి పైపొరల్లో ఉండే మేలైన సూక్ష్మజీవులను లోతు దుక్కి ద్వారా నేల అడుగు భాగానికి చేరి చనిపోతాయని, అందుకే భూమిని దున్నే రైతును తాను దుశ్శాసనుడిగా భావిస్తానంటారాయన. దున్నమని చెప్పే వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తలను దుర్యోధనుడితోనూ... నిధులు సమకూరుస్తూ ఈ దుర్మార్గానికి మద్దతుగా నిలుస్తున్న ప్రభుత్వాలను దృతరాష్ట్రుడిగా అభివర్ణిస్తారు. ఇక జరుగుతున్న చెడు నంతటినీ చూస్తూ... ఏ ఒక్కరినీ వారించని మేధావివర్గాన్ని భీష్మాచార్యులతో పోలుస్తారాయన. నేలను దున్నడాన్ని భూమాతను వివస్త్రను చేయడంగానూ... భూదేవిని చెత్త, కలుపు మొక్కలతో ఆచ్ఛాదన చేసేవాడిని ద్రౌపతికి చీరలు అందించిన శ్రీకృష్ణుడిగానూ చెబుతారాయన. (ఈ వర్ణన బోర్డ్‌పై గీసి మరీ ఉంటుంది. వీడియోలో గమనించొచ్చు) మంచునీ, వర్షాన్నీ, ఎండనీ, తేమనీ, గాలినీ ఎలా ఉపయోగించుకోవాలో పాలేకర్ చెబుతుంటే అద్భుతమనిపిస్తుంది.

వ్యవసాయ శాస్త్రవేత్తలు మొక్కలకు అవసరమైన మూడు ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియంలను ఎన్‌ : పీ : కే గా చెబుతుంటారు. ఈ మూడు అందించే సూక్ష్మజీవులు, వానపాములు మన భూమిలోనే ఉన్నాయనీ వాటిని ఈ కృత్రిమ ఎన్ పి కేలతో చంపేయవద్దని అంటారాయన. ఈ సూక్ష్మజీవులన్నింటినీ ఉత్పత్తి చేసే ఒకేఒక ఫ్యాక్టరీ దేశీయ ఆవు జీర్ణాశయమే అనీ... దానిని నేను శాస్త్రీయంగా నిరూపిస్తాననీ సవాల్ చేస్తారాయన. ఒక్క దేశీయ ఆవు పేడ, మూత్రం కలిపిన కల్చర్‌తో ముఫ్పై ఎకరాల సేద్యం చేయవచ్చునన్నది పాలేకర్ సిద్దాంతం. ప్రస్తుతం ఉన్న జెర్సీ, హెచ్ ఎఫ్ ఆవులను ఆయన ఆవులుగా అంగీకరించరు. అవి వేరే జాతికి చెందిన భయంకర జంతువులని సశాస్త్రీయంగా వివరించడం పాలేకర్ ప్రత్యేకత. పాలేకర్ నోటివెంట వస్తున్న సాంకేతిక బాష, దేశ- విదేశీ శాస్త్రవేత్తల పేర్లు, వారు చేసిన మంచిచెడ్డలు చెప్పడం చూసి ప్రతి వ్యవసాయ శాస్త్రవేత్తా నోరెళ్లబెట్టడం తప్ప మరేం చేయలేకపోయారక్కడ. నెహ్రూ ప్రవేశపెట్టిన హరిత విప్లవాన్ని ‘ఆనాటి అవసరం- నేటి ప్రమాదం’గా అభివర్ణిస్తారాయన. అదంతా విదేశీకుట్ర అని బల్లగుద్ది మరీ చెబుతారు. ఇది వింటున్న మీకు నిజమా అనిపిస్తుంది కానీ... పాలేకర్ శిక్షణా శిబిరంలో వారంపాటు కూర్చుంటే మాత్రం మీరే ఈ వాదనకు దిగుతారు. కొన్ని సంవత్సరాల క్రితం పాలేకర్ విధానానికి, ఇప్పటి విధానానికి పెద్దగా మార్పులు లేకున్నా... ఆయన వాదనలో హేతుబద్దత, సాంకేతికత, ఉదాహరణ సహిత వివరణ ఇప్పుడు మరింత పెరిగిందని చెప్పాలి. దీనికి తోడు ఆయన ఫాలోవర్స్ వేలమంది మేము... మేము అంటూ స్టేజ్ ఎక్కి... తమ విజయాలు, అనుభవాలు చెబతుంటే... సభికుల నుంచి చప్పట్ల మోత ఆగడంలేదు. ఒకప్పుడు ఎవరో పిచ్చోళ్లు చేస్తార్లే అన్న పాలేకర్ వ్యవసాయం నేడు పట్టభద్రుల దగ్గరనుంచి 70, 80 సంవత్సరాల వృద్ధుల వరకూ చేస్తున్నారని ఈ సమావేశం రుజువులతో సహా నిరూపించింది. అన్ని రకాల పంటల్లోనూ వారి విజయాలు, వాటిని వారు వివరిస్తున్న తీరు మరెవరూ ప్రశ్నించలేని విధంగా ఉంది. పాలేకర్ వ్యవసాయంలో నీరు, విద్యుత్ కేవలం ఇప్పుడు వాడుతున్న దానిలో 10 శాతం మాత్రమే అవసరమవుతుంది. అదెలా అంటే చెప్పడం చాలా సింపుల్. చేపలు పట్టివ్వడం కాదు, పట్టడం నేర్పు అన్నది ఒక చైనా సామెత. ఇదీ అంతే! మొక్క మొదటికి నీవు నీరందించడం కాదు... నీరు ఎక్కడ లభిస్తుందో అక్కడకు అంటే భూమి లోతుల్లోకి మొక్కల వేర్లు వెళ్లేలా చేయడం పాలేకర్ విధానంలో నీటి ఆదాకు ప్రధాన సూత్రం. అలాగే చీడపీడల విషయంలో కూడా ఆయన చెప్పేది చాలా సింపుల్. ఏ తెగులు, పురుగు ఊరకనే మీ పంటపై దాడిచేయదు. మీరు చేసే తప్పులే చీడపీడలను పెంచుతాయి. వాటిని అరికట్టేందుకు పాలేకర్ వద్ద అనేక టెక్నిక్‌లు ఉన్నాయి. లీటర్ రెండు వేలు పెట్టి కొనే తెగులు మందుకంటే.. మీ ఇంట్లో మూడు రోజులు పులిసిన పుల్లమజ్జిగ పవర్‌ఫుల్ అంటారు పాలేకర్. కావాలంటే పరీక్షించుకోమని సవాల్ విసురుతారు.

సాధ్యాసాధ్యాలు తెలియాలంటే పాలేకర్ శిక్షణలో పాల్గొనాల్సిందే. అది ఒకరు చెబితే అబ్బేది కాదు. చేస్తేనే తెలుస్తుంది కానీ చూస్తే అర్థం కాదు. ఇక ఈ విధానం రైతుకు అన్ని విధాలా లాభమే. ఏ వస్తువు కోసం రైతు డబ్బు తీసుకుని సమీపంలోని పట్టణానికి పోకూడదు. పట్టణవాసులే తమ ఆహారాన్ని వెతుక్కుంటూ డబ్బు తీసుకుని పల్లెకు వెళ్లాలి. ఇదీ పాలేకర్ విధానంలో మూలసూత్రం. దానికి ఆయన ప్రాక్టికల్ విధానాలను చూపుతారు. ఈ పురుగుమందులు, ఎరువులు, హైబ్రిడ్ విత్తనాలు అన్నీ వేస్ట్ అంటారు. అడవిలో చింతచెట్టు, మామిడి చెట్లకు ఎవరూ ఎన్ పి కె అందించకపోయినా, నీరు పెట్టకపోయినా, పురుగు మందు కొట్టకపోయినా క్వాలిటీ కలిగిన భారీ ఫలసాయాన్ని అందిస్తాయని గుర్తుచేస్తారు. అడవిలో ఏ చెట్టు ఆకు తీసుకుని లాబ్‌లో పరీక్షించినా ఏ పోషకాల లోపం ఉండదనీ... మరి వాటికి పోషకాలను ఎవరు అందించారన్నది పాలేకర్ ప్రశ్న. అలాగని అదేమీ తర్కానికి నిలవని గుడ్డి నమ్మిక కాదు సుమా..! అడవిలోని చెట్టుకూ... మన చేలోని మొక్కకూ పోలికేంటబ్బా అనుకుంటూ మీ బుర్రలో తలెత్తే ప్రతి ప్రశ్నకూ పాలేకర్ వద్ద సశాస్త్రీయమైన సమాధానం ఉంది. మన దేశీయ విత్తనాలు, దేశీయ ఆవు, మన చుట్టూ ఉంటే చెట్టూ చేమా, మొక్కా మోడే మన వ్యవసాయ అవసరాలు. ఈ క్రమంలో ఏర్పాడే ప్రతి అనుమానాన్ని సూక్ష్మంగా చర్చిస్తారాయన. ప్రతి నేలకు, ప్రతి పంటకు సరిపడిన పంటలు, అంతర పంటలు, మిత్ర పంటలు, శత్రు పంటలు వివరిస్తారు. పాలేకర్ విధానం వందశాతం ఫాలో అయితే చాలు... రెండేళ్లలో మీ సాగు లాభాలపట్టాలపై పరుగులు తీస్తుంది. వ్యవసాయం చేసిన వాడు ఎవడూ ఆత్మహత్య అన్న ఆలోచనే చేయడు. ఎందుకంటే పాలేకర్ విధానం అనేది మహారాష్ట్రలోని మహా కరువు ప్రాంతం, ఈ దేశంలో రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకునే ప్రాంతమైన మరఠ్వాడాలో పుట్టింది. ఆయన అక్కడి వాడే. అందుకే అందులో కరువును ఎదుర్కొనే పద్దతులన్నీ ఇమిడి ఉన్నాయి.

ఇప్పటివరకూ పాలేకర్ వ్యవసాయ విధానాన్ని ఏ ప్రభుత్వమూ ఇంత బాహాటంగా సపోర్ట్ చేయలేదు. మరి చంద్రబాబు ప్రభత్వం ఎందుకు ప్రమోట్ చేస్తున్నట్టంటారా? బాబు ఎంతైనా తెలివైన వాడు కదా. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వాలు ఆపలేవని ఆయనకు తెలుసు. అలాగే ప్రభుత్వాలు, వేలు, లక్షల కోట్ల ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలపై సబ్సిడీగా ఇవ్వాల్సి వస్తోంది. పాలేకర్ విధానంలో ఇవేమీ అవసరం లేదు. ఏ సభలో అయినా ముఖ్యమంత్రి వచ్చి ఏమి కావాలని అడిగితే సభికుల కోర్కెల చిట్టాకు పుల్ స్టాప్ ఉండదు. కానీ ఇక్కడకొచ్చిన ముఖ్యమంత్రి వేలమంది రైతులను ఏం కావాలని అడిగితే... కేవలం ఒక్కో రైతుకు ఒక్కో దేశీయ ఆవు, ఈ విధానంలో పండించిన పంటకు ఇది ఆరోగ్యకరమైనదన్న సర్టిఫికేట్ ఇస్తే చాలన్నారంటే... రైతు అవసరాలు ఈ విధానంలో ఎంత పరిమితమో అర్థం చేసుకోవచ్చు. వెంటనే ముఖ్యమంత్రి పదివేల సబ్సిడీతో దేశీయ ఆవులను ఇస్తామని సభలోనే ప్రకటించారు. సర్టిఫికేట్ ముంబైవెళ్లి డబ్బుకట్టి తెచ్చుంటున్నామన్న ఆవేదనకు స్పందిస్తూ ... ప్రభుత్వమే ఉచితంగా సర్టిఫికేట్ ఇచ్చే విధానాన్ని ఆరు నెలల్లోనే అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. కేంద్రప్రభుత్వం కూడా ఈ సభకు వ్యవసాయశాఖ సెక్రటరీ రాణీ కుముదినీని పంపి రైతుల స్పందనను అధ్యయనం చేయడం ఈ కార్యక్రమంలో మరో ముఖ్యమైన హైలైట్. ఈ విధానం బాగా పాపులర్ అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్‌లలో వ్యవసాయానికి కేటాయింపులను లక్షల కోట్ల నుంచి వేలకోట్లకు తగ్గించుకోవచ్చు. అయితే బహుళజాతి విత్తన, ఎరువులు, పురుగుమందుల కంపెనీల లాబీకి ప్రభుత్వాలు లొంగకుండా ఉంటేనే ఇది సాధ్యమవుతుందనుకోండి. పాలేకర్ విధానాన్ని ప్రోత్సహించేందుకు కృతనిశ్ఛయంతో ఉన్నానన్న చంద్రబాబు దీనికోసం ఒక కమిటీని కూడా ఏర్పాటుచేశారు. పాలేకర్‌తో పాటు ఏపీ వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ విజయ్‌కుమార్, ప్రముఖ శాస్త్రవేత్త ఆలపాటి సత్యనారాయణ, వ్యవసాయశాఖ మంత్రి పుల్లారావులకు ఈ కమిటీ బాధ్యతలు అప్పగించారు. ప్రతి నెలా 10 రోజులు ఏపీలోనే ఉండాలన్న ముఖ్యమంత్రి వినతికి పాలేకర్ కూడా సుముఖత వ్యక్తంచేశారు. త్వరలోనే ఏపీ ప్రభుత్వం పాలేకర్ విధానంపై ముందుకు వెళ్లేందుకు ఒక రోడ్ మ్యాప్ సిద్ధంచేయనుంది. దీనిని పాలేకరే స్వయంగా పర్యవేక్షించనున్నట్టు తెలిసింది.

అన్నట్టు ఈ కార్యక్రమం మధ్యలోనే పాలేకర్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. దీంతో పాలేకర్ విధానానికి ఒక రకంగా దేశ నాయకత్వం ఆమోదం లభించిందన్న భావన సర్వత్రా వ్యక్తమయ్యింది. ఈ సందర్భంగా సన్మానాలు సరే సరి. పాలేకర్ శిష్యులు ఆయనకు పాదాభివందనాలు చేస్తూ తమ భక్తిని చాటుకున్నారు. ముఖ్యమంత్రే నేరుగా వచ్చి పాలేకర్‌ను ఏపీ ప్రభుత్వం తరపున అధికారికంగా సత్కరించారు. ఈ సందర్భంగా రైతులు ఒక డిమాండ్ వినిపించారు. అది వింటే రైతులు ఎంత తెలివైన వారో అనిపిస్తుంది సుమా... ( ఒక రైతు.... పాలేకర్ కు ప్రభుత్వం వెంటనే రక్షణ కల్పించాలని కోరడం. లక్షల కోట్లు కోల్పోయే బహుళజాతి వ్యవసాయ కంపెనీల వల్ల పాలేకర్‌కు ఇబ్బందులు ఉంటాయని చెప్పడం). పాలేకర్ జీరో బడ్జెట్ ప్రాకృతిక ఆధ్యాత్మిక వ్యవసాయం గురించి ఓ పది రోజులైనా వెచ్చిస్తే తప్ప ఒక అవగాహనకు రాలేం. మరి ఈ పది నిముషాల్లో దాని గురించి చెప్పాలని భావించడం సాహసమే అవుతుంది. అన్నట్టు ఆధ్యాత్మిక వ్యవసాయం అన్నారు కదా అని నాస్తికులకు దూరం అనుకునేరు. నాస్తికులు, హేతువాదులకే పాలేకర్ వ్యవసాయ విధానం మరింత నచ్చుతుంది. దీని గురించి తెలుసుకోవాలంటే ఆయన లిటరేచర్ పూర్తిగా చదివి... శిక్షణకు హాజరయితేనే సాధ్యం. అక్కడితో మన అనుమానాలు పటాపంచలు అయిపోతాయి. పైగా మీరు ఏ పంట వేద్దామనుకుంటున్నారో అదే పంటను ఇప్పటికే పాలేకర్ విధానంలో సాగుచేస్తున్న మార్గదర్శకులు మీకు అక్కడ కోకొల్లలుగా తారసపడతారు. రారమ్మంటూ వారి క్షేత్రానికి ప్రేమపూర్వంకంగా ఆహ్వానిస్తారు. మీకు తెలుసా... కర్ణాకలో కృష్ణప్ప అనే రైతు పాలేకర్ విధానంలో కొబ్బరి దాని అనుబంధ పంటలు పండిస్తూ ఎకరాకు లక్షల్లో ఆర్జిస్తున్నారు. యూట్యూబ్‌లో ఆ వీడియోలు ఉన్నాయి. సందర్శకుల తాకిడి తట్టుకోలేక మనిషికి వెయ్యి రూపాయల టిక్కెట్ కూడా ఆయన పెట్టారట. అయినా... ఆయనను వ్యవసాయం చేసుకోనిస్తే ఒట్టట.... ఏంటి మీకు కూడా ఆసక్తిగా ఉందా... మరైతే వెతకండి పాలేకర్ పుస్తకాలు ఎక్కడున్నాయో..! ఆ‍యన శిక్షణ ఎక్కడుందో..! నెట్‌లో సెర్చ్ చేయండి... యూట్యూబ్‌లో చూడండి.. ఆపై అభ్యసించి ఆచరించండి.. మీరు ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించండి. ఆరోగ్యం, ఆనందం మాత్రమేనా... మరి డబ్బులో అంటారా..! పాలేకర్ విధానంలో ఖర్చు ఉండదండి బాబూ... అంతా ఆదాయమే.... అర్థం చేసుకోరూ..... ఆల్ ది బెస్ట్.....

No comments:

Post a Comment